తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం (Cabinet Meeting) ముగిసింది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ( Governor) తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి సమావేశం కావడంతో గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. దీంతో గవర్నర్ ప్రసంగంలో చేర్చాల్సిన అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు.
అనంతరం గవర్నర్ ప్రసంగానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని చేర్చనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. వాటిలో కేవలం రెండు రెండు గ్యారెంటీలను అమలు చేశారు.
మిగిలిన నాలుగు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే విషయంపై మంత్రివర్గంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా వుంటే నూతనంగా శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాసన సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇప్పటి వరకు ప్రమాణం స్వీకారం చేయకుండా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఇది ఇలా వుంటే రాష్ట్రంలో పాలనపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. కీలకమైన పోస్టుల్లో సమర్థవంతమైన అధికారులను నియమించేందుకు సీఎం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారుల నియామకంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. తన వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలో ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ, ఒక మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉండేలా రేవంత్ రెడ్డి చూసుకున్నారు. ఇక పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది.
విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి కేబినెట్‌లో స్థానం కల్పించాల్సి ఉంది. వారిలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి రెండు, బీసీ సామాజిక వర్గానికి రెండు, ఎస్టీకి ఒకటి, ఎస్సీకి మరొక మంత్రి పదవులు కల్పించాలని కసరత్తులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గంలో యాదవులు, ముదిరాజు మున్నూరు కాపులకు మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.