తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని (Cabinet Meeting) రేపు నిర్వహించనున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నెల రోజుల పాలన, జాబ్ క్యాలెండర్, ఆరు గ్యారెంటీల అమలుకు అనుసరించాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. మొదటగా మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించింది.
అటు ఆరోగ్య శ్రీ పథకం కింద బీమా మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచింది. ఇక మిగిలిన గ్యారెంటీల కోసం ప్రజల దగ్గర నుంచి ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇక ఫిబ్రవరిలోనే 20వేల ఉద్యోగాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సీఎం పదవిని చేపట్టి నెల రోజులు అవుతున్న సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు చాలా సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. ఉజ్వల భవిత వైపునకు పాలన అడుగులు వేస్తోందని చెప్పారు. తాము సేవకులమే తప్ప పాలకులం కాదనే మాటలను నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ఓ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజు ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, చైతన్యపు తెలంగాణ కోసం పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తానని ట్వీట్ చేశారు.