ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikaramarkha) బేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధానితో వారు సమావేశం అయ్యారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటి సారి.
రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాల గురించి ప్రధాని మోడీతో ఇరువురు నేతలు చర్చించారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ప్రధానితో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలకుల ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యిందని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు గాను కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని, రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. విభజన హమీలను అమలు చేయాలని ఈ సందర్బంగా ప్రధానిని కోరామన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని కోరామన్నారు. రాష్ట్రానికి ఐఐఎం, ఒక సైనిక స్కూల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అడిగామన్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మంజూరూ చేయాలని కోరామని, వాటిపై ప్రధాని మోడీ సానూకూలంగా స్పందించారని చెప్పారు.