తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పనుంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి(Dharani Committee member M. Kodanda Reddy) వెల్లడించారు. ఆయన సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బ్యాంకులో రైతుల రుణాల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని చెప్పారు. ఈ మేరకు పూర్తి సమాచారం అందిన వెంటనే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ రూ.500 ఇస్తామని చెప్పామని, కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం రూ.2600 ఇస్తున్నందున బోనస్ గురించి ప్రస్తావించలేదని చెప్పారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ శాసనసభపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజల తీర్పును అవమానిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా రైతులు చెల్లించాల్సిన రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇచ్చి, రూ.రెండు లక్షల రుణమాఫీకి ప్రణాళికలు రచిస్తోంది. వీలైనంత త్వరగా రుణమాఫీ చేయడంతో పాటు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకోడానికి వెసులుబాటు కల్పించనుంది.