ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. ట్యాంక్ బండ్ పై ప్రజాయుద్ద నౌక గద్దర్ (Gaddar) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి మాటిచ్చారు. అన్నట్టుగానే తాజాగా గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఇటీవల తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసింది. దానికి హెచ్ఎండీఏ కూడా ఆమోదం తెలిపింది. తాజాగా గద్దర్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని కాంగ్రెస్ సర్కార్ కేటాయించింది. ఈ మేరకు రేవంత్ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది అగస్టు 6న ప్రజాయుద్ద నౌక గద్దర్ కన్నుమూశారు. ఈ వార్త తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి నిర్వహించిన అంతిమ యాత్రలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గద్దర్ అంతిమ యాత్ర పూర్తయ్యే వరకు రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు.
ఇది ఇలా వుంటే గద్దర్ర తన కుమారుడు సూర్యను రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడించారు. ఈ నేపథ్యంలో గద్దర్ కుమార్తె వెన్నెలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ను కాంగ్రెస్ కేటాయించింది. కానీ ఆ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు.