రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన (Praja Palana) అభయహస్తం దరఖాస్తుల (Applications) స్వీకరణ గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మహలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28 నుంచి నేటి వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
మరోవైపు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటికీ ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేపటి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో అధికారులే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇక నుంచి మండల కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారని ఇటీవల సీఎం వెల్లడించారు.
ఎన్ని కష్టాలు ఉన్నా ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులాగే ఏ సమస్య వచ్చినా వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. హుస్నాబాద్ (Husnabad)లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినప్పటికీ ప్రజలకు మంచి చేయాలని ధృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలపై కేబినెట్‌లో చర్చించామన్నారు. ఇప్పటికే అందులో రెండు గ్యారెంటీలను అమలు చేశామని పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి తనకు ఓటు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాలతో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలపై దరఖాస్తులను స్వీకరిస్తున్నామని వివరించారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియనుందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 85 వేల అప్లికేషన్లను స్వీకరించామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 420 అని విమర్శించడం తగదని బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య పునరుద్దరణలో భాగంగా హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ప్రారంభించడం మంచి పరిణామమని కొనియాడారు.
ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న హైదరాబాద్‌లో 150 డివిజన్లలో, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగిందన్నారు. హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేయించి అవసరమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే హుస్నాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్ఫష్టం చేశారు. గౌరవెల్లి నిర్వాసితులతో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రవర్తించి సమస్య పరిష్కరిస్తామన్నారు
ఈ మధ్యనే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, సీఎంతో చర్చించానన్నారు. ఇంకా 2000 ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తామన్నారు. దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువ ఫేస్ 2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. హుస్నాబాద్‌లో ఉన్న బస్ డిపోను బలోపేతం చేస్తానన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్లిన గౌరవం పెరిగేలా చేస్తామన్నారు.