నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. నాపై దాడి చేస్తే ఆ రక్తాన్ని సిరాగా వాడుకుంటా.. ఆ సిరాతోనే నా చరిత్ర నేనే రాసుకుంటా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై (Tamilisai). శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్ భవన్ (Raj Bhavan) లో ధన్యవాదాలు తెలిపే సభ నిర్వహించారు గవర్నర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తమకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ప్రధాని మోడీ (PM Modi) కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై తమిళిసై మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. గవర్నర్ గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని వ్యాఖ్యానించారు. తాను వచ్చిన తర్వాత ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని చెప్పారు. తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం సంతోషంగా అనిపించిందన్నారు.
వివాదాస్పదమైన ప్రోటోకాల్ అంశంపైనా స్పందించారు గవర్నర్. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మోడీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి రాజకీయ నాయకుడు అయినా… తాను సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించానని గుర్తుచేశారు.
గవర్నర్ కంటే ముందు తాను రాజకీయ నాయకురాలినని… దాంట్లో రహస్యం దాచి పెట్టడానికి ఏమీలేదన్నారు తమిళిసై. తెలంగాణలో కొందరు తనను రాజకీయ నాయకురాలు అని అంటుంటారని.. అది నిజమే కదా అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలపై మక్కువతోనే తాను ఎంతగానో ఇష్టమైన వైద్య వృత్తిని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువని.. అయితే.. భారత్ లో 15 లక్షల పంచాయతీలకు ప్రెసిడెంట్ లుగా మహిళలు ఉన్నారన్నారు. తాము పురుషులకంటే మెరుగ్గానే పని చేస్తున్నానని వివరించారు.