వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. పెండింగ్ చలాన్ల (Pending Challans)విషయంలో వాహనదారులకు రాయితీల(Discounts)కు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్ చాలన్లకు డిస్కౌంట్ వర్తింపచేస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి నుంచి జనవరి 10 వరకు ఈ రాయితీలు అమలులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. వాహనదారులు ఈ రాయితీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల చలాన్లపై 90 శాతం రాయితీ ఇచ్చారు. ఫోర్ వీలర్లకు 60 శాతం, ద్విచక్ర వాహనాలకు 80 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీలను ప్రకటించింది.
జనవరి 10లోపు చెల్లించే వారికే ఈ రాయితీలు వర్తిస్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్ల పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఇదే తరహాలో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ద్విచక్ర వాహనాల పెండింగ్ చాలాన్లపై 75 శాతం, మిగతా వాహనాలకు 50 శాతం రాయితీ ప్రకటించారు.
ప్రభుత్వ ప్రకటనకు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. సుమారు 65 శాతం మంది పెండింగ్ చాలాన్లను చెల్లించారు. దీంతో కేవలం 45 రోజుల వ్యవధిలో పెండింగ్ లో ఉన్న చలానాలపై మొత్తం రూ. 300 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ ఏడాది కూడా భారీగా డబ్బు వసూలు అవుతుందని భావిస్తున్నారు. ఈ చలానాను echallan.tspolice.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి వెహికల్ నంబర్ ఎంటర్ చేసి చెల్లించవచ్చని పోలీసులు చెబుతున్నారు.