స్కూల్, కాలేజీ, ఆఫీస్, జిమ్, బస్టాండ్, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడచూసినా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. తాజాగా హకీంపేట (Hakimpet) స్పోర్ట్స్ స్కూల్ లో వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడో మృగాడు. ఓఎస్డీ (OSD) గా పని చేస్తున్న హరికృష్ణ రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎమ్మెల్సీ కవిత ట్వీట్
హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగితో సహా మరో ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో వచ్చిన కథనాలతో.. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని.. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
మంత్రి రియాక్షన్
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఆదివారం ఉదయం 7 గంటలకు తెలిసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే ఉరి తీయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఘటనపై వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని ఆదేశించామని పేర్కొన్నారు.
ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
ఓఎస్డీ హరికృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపింది. మహిళలపై వేధింపులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది కేసీఆర్ సర్కార్.