Telugu News » Telia Rumal: జీ-20లో తెలంగాణా తేలియా రుమాలు

Telia Rumal: జీ-20లో తెలంగాణా తేలియా రుమాలు

ప్రకృతి సిద్ధంగా లభించే రంగులతో ఈ రుమాలును తయారు చేస్తారు. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదను, నువ్వుల నూనెను ఎండలో వేడి చేసిన నీటిలో కలిపి నూలును అందుతో నానబెడుతారు.

by Prasanna

పుట్టపాక తేలియా రుమాలును జీ-20 సదస్సులో ప్రపంచ ప్రతినిధులకు పరిచయం కాబోతోంది. ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జరిగే జీ-20 సమావేశాల్లో భారతీయ హస్తకళల ప్రదర్శనలో భాగంగా పుట్టపాక తేలియాడే రుమాలును ప్రదర్శించనున్నారు. రుమాలంటే మనం జేబులో పెట్టుకునేది కాదు, దానికి 20, 30 రెట్లు పెద్దగా ఉండే ఒక వస్త్రం.

పుట్టపాక తేలియా రుమాలుకు ప్రత్యేకమైనది. ఇది ఎండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా లభించే రంగులతో ఈ రుమాలును తయారు చేస్తారు. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదను, నువ్వుల నూనెను ఎండలో వేడి చేసిన నీటిలో కలిపి నూలును అందుతో నానబెడుతారు.

20 రోజుల పాటు…

అలా నానబెట్టిన నూలును కనీసం 20 రోజుల పాటు రోజుకు రెండు పూటలా చేతులతో పిసుకుతారు. తరువాత నూలును పిండి ఆరబెడతారు. ఆరిన తరువాత మళ్లీ నీటిలో నానబెడతారు. ఇలా 20 రోజుల పాటు చేయడం ద్వారా దారాల్లోకి నూనె ఇంకి రంగులు చక్కగా అంటుకుంటాయి. ఆ తర్వా ఆ వస్త్రానికి వివిధ డిజైన్లలో మగ్గాలపై నేసి రుమాలుగా తీర్చిదిద్దుతారు.

telia rumal 3

వేసవిలో ఎందుకు చల్లగా ఉంటుందంటే…

సహజసిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలుకు ఔషధ గుణాలు అందుతాయి కాబట్టే వేసవి తాపం తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యేకంగా తేలియా రుమాలును కొనుగోలు చేస్తుంటారు.

ఒక్కో రుమాలు వేలల్లోనే…

ఈ రుమాలు డిజైన్లను బట్టి వేలల్లోనే మొదలవుతుంది. కనీస ధర రూ.10 వేల వరకు ఉంటుందని పుట్టపాక కళాకారులు చెప్తున్నారు. దీనిని తయారు చేసేందుకు 30 నుంచి 60 రోజులు పడుతుందని తెలిపారు. కెమికల్స్ తో తయారు చేసేవి అయితే రూ. 500 నుంచి అమ్ముతారని తెలిపారు. తాము సహజ రంగులు వాడటంతోనే తాము చేసే రుమాలుకు ధర ఎక్కువని అంటున్నారు. పుట్టపాక తేలియా రుమాలు ఇక్కడి నుంచి ముంబాయి, జర్మనీ, జపాన్‌, సింగపూర్‌, అమెరికా, నెదర్లాండ్‌, గుజరాత్‌, చెన్నై, సోలాపూర్‌, కోల్‌కతా, అరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంటాయని తెలిపారు.

telia rumal 4

గల్ఫ్ దేశాల్లో దీనికి డిమాండ్…

తాము తయారు చేసిన పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును జీ-20 ప్రదర్శనలో ఉంచడం గర్వంగా ఉందని పుట్టపాక చేనేత కళాకారులు అంటున్నారు. గల్ఫ్ దేశాల్లో వేడి వాతావరణ ఉండటంతో చల్లదనం ఇచ్చే తేలియా రుమాలు కోసం వారు ఎక్కువగా ఆర్డర్లు పెడుతుంటారని తెలిపారు. ఈ తేలియా రుమాలు వస్త్రాన్ని దుప్పట్టాలుగా, వేడి నుంచి కాపాడేందుకు మెడలో చుట్టుకునే వస్త్రంగా, తలకు రక్షణ నిచ్చే వస్త్రం, నమాజ్ చేసేటప్పుడు కింద వేసుకునేందుకు వాడతారని తెలిపారు.

Telia rumal
అవార్డులు పొందిన రుమాలు…

పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు, డబుల్‌ ఇక్కత్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ దుబ్బటి తదితర వస్ర్తాలను ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆకర్షిస్తున్నాయి. పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి వారిని ఇప్పటికే రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు వరించాయి.

You may also like

Leave a Comment