పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ (BRS Leader) కీలక నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ సర్కారు పనితీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం తెలంగాణ భవన్లో ఎల్ రమణ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారం పొందడం కోసం నెరవేర్చలేని విధంగా హామీలు గుప్పించారని, కానీ ఇప్పుడు వాటి ప్రస్తావన కూడా తీయడం లేదన్నారు.
చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి సర్కారే కారణమని ఎల్ రమణ మండిపడ్డారు. హస్తం పార్టీ పవర్లోకి రాగానే వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.50వేల రుణం ఇచ్చారని గుర్తుచేశారు.
దసరా, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేయడం ద్వారా చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరికిందన్నారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు రూ.2వేల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అదేవిధంగా నేతన్నలకు బీమా సదుపాయం కల్పించి వారి కుటుంబానికి రూ.5లక్షల సాయం చేశారన్నారు. చేనేత కార్మికుల సమస్యలు తీర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దృష్టికి నేతన్నల సమస్యలు తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను చిన్నచూపు చూస్తోందని, ఏయే వర్గాలు ఆయనకు ఇష్టమో ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు.