తెలంగాణలో ఈదురుగాలులు (power full Wind ) బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి వేగంగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు ప రిధిలోని మానేరు వాగులో నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు (Bridge collapse) ఒక్కసారిగా కుప్పకూలాయి. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఈ వంతెనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు వాగుపై రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండే ఉండేందుకు నిర్మిస్తున్నారు.
సుమారు రూ.46 కోట్లతో 2016లో మానేరు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2023-24లో రూ.11 కోట్ల అదనపు నిధులను కేటాయించారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా మెరుగవనుంది. ఉన్నట్టుండి నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గడ్డర్లు కూలిపోవడానికి నిర్మాణలోపమే కారణమని స్థానికులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల చేత విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.