అక్టోబర్ 7న ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ (Hamas) మిలిటెంట్ల దాడి అనేది అతి పెద్ద తీవ్ర వాద చర్య అని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా దాడికి సంబంధించిన తదుపరి చర్యలు అని తెలిపారు. ఇది ఇప్పుడు గాజా ప్రాంతాన్ని వేరే దిశలో నడిపిస్తోందని వెల్లడించారు.
గాజా ప్రాంతంలో ఈ సంఘర్షణ సర్వ సాధారణం కాకూడదని, ఆ ప్రాంతంలో స్థిరత్వం వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని చెప్పారు. ఈ లోగా ఈ ప్రాంతంలో వివిధ సమస్యల మధ్య సమతుల్యతను మనం కనుగోవాలన్నారు. ఇందులో వేరే ప్రశ్నే లేదని జైశంకర్ అన్నారు.
ఎక్కడైనా ఉగ్ర వాద సమస్య ఉంటే, ఉగ్రవాదం అనేది ఆమోదయోగ్యం కాదని మనం భావిస్తే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మనమంతా నిలబడాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో పాలస్తీనా కూడా సమస్యల్లో ఉందన్నారు. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా పరిష్కారం కావాలన్నారు.
ఆ సమస్యకు పరిష్కారం కనుగోవాల్సి వస్తే ఇజ్రాయెల్-పాలస్తీనాలు చర్చల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. అంతే కానీ ఇరు దేశాల సంఘర్షణ, ఉగ్రవాదం ద్వారా ఆ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కనుగొనలేరని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవతా చట్టాన్ని తప్పనిసరిగా గౌరవించాలని తాము విశ్వసిస్తామన్నారు.