చాపేకర్ సోదరులు (దామోదర్ హరీ చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ్ హరి) Chapekar Brothers …. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ప్రాణాలను అర్పించిన గొప్ప దేశ భక్తులు. పుణెలో బ్రిటీష్ అధికారుల ఆగడాలను చూసి సహించలేక వలస పాలనకు ఎదురు తిరిగిన నిప్పు కణికలు. బ్రిటీష్ అధికారి రాండ్ ( Walter Charles Rand)ను హత మార్చి మరణాన్ని ముద్దాడిన భరత మాత ముద్దు బిడ్లలు వాళ్లు.
అది 1896 సంవత్సరం. పుణెలో ప్లేగు మహమ్మారి విలయం తాండవం చేసింది. వందలాది మంది ప్రజలు చనిపోయారు. వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. అనేక మంది నగరాన్ని విడిచి వెళ్లి పోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్లేగు నివారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ ఈ కమిటీకి నేతృత్వం వహించాడు. పుణెలో పర్యటిస్తు అక్కడి పరిస్థితులను రాండ్ పర్యవేక్షించాడు. పుణెలో పర్యటిస్తున్న సమయంలో రాండ్ అత్యంత దుర్మార్గం ప్రవర్తించాడు. వ్యాధిపై విచారణ పేరిటతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేల వ్యవహరించడం లాంటివి చేశాడు.
రాండ్ అనుచిత ప్రవర్తన గురించి పత్రిక వ్యాసాల ద్వారా బాలగంగధర్ తిలక్ ఎండగట్టాడు. ఈ వ్యాసాలను చదివిన చాపేకర్ సోదరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బ్రిటీష్ వాళ్ల దురాగతాలకు చరమగీతం పాడాలనుకున్నారు. అధికారి రాండ్ ను హతమార్చేందుకు ప్రణాళికలు రచించారు. 1897 జూన్ 22న జరిగిన ఉత్సవాల్లో రాండ్ పై చాపేకర్ సోదరులు కాల్పులు జరిపారు. దీంతో రాండ్, అతని అనుచరుడు అయ్యరెస్ట్ మరణించారు.
పోలీసు ఇన్ఫార్మర్ ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు దామోదర్ చాపేకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 18 ఏప్రిల్ 1898న ఆయన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. పరారీలో ఉన్న బాలకృష్ణ చాపేకర్ కు 1899 మరణ శిక్ష అమలు చేశారు. తన సోదరులను బ్రిటీష్ వారికి పట్టించిన నమ్మక ద్రోహులను వాసుదేవ చాపేకర్ హతమార్చాడు. అనంతరం వాసుదేవ చాపేకర్ ను కూడా బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది.