హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన ఈ కార్ రేసింగ్ (E- Car Racing) గేమ్స్ రద్దయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు ధ్రువీకరించారు. ఈ కార్ రేసింగ్ కు సంబంధించి గత బీఆర్ఎస్ (BRS) సర్కార్ హయాంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు రేసింగ్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ వేదికగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించింది.
ఈ పోటీలు విజయవంతం కావడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ ఇంతలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇటీవల కాంగ్రెస్ సర్కార్ తో సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.
అప్పటి నుంచి పలు మార్లు ప్రభుత్వంతో సంస్థ ప్రతినిదులు భేటీ అయినప్పటికీ ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కనిపించలేదని తెలుస్తోంది. రేసింగ్ కు మరికొన్ని వారాలే ఉండటం, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రేసింగ్ ను రద్దు చేస్తున్నట్టు తాజాగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.