తెలంగాణలో పంటలు కోతకు రావడంతో రైతులు కొనుగోలు (Rice Purchase centers) కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే, కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్రాడింగ్ జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సార్లు స్పందించారు. ఒకసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించగా మరోమారు ప్రెస్మీట్ ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ఈ క్రమంలోనే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కమిషనర్ డీఎస్ చౌహాన్ (DS Chowhan) శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు భరోసాతో పాటు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సాధారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏప్రిల్ 1న ప్రారంభిస్తారు.
కానీ, రైతులు మార్కెట్లకు ధాన్యం బస్తాలను తీసుకొని రావడంతో మార్చి 25 నుంచే కొనుగోలు సేకరణను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 7,149 కొనుగోలు సెంటర్లు ఉండగా, 6916 కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో పంట కోతలు త్వరగా జరుగుతాయని, మరికొన్ని జిల్లాల్లో లేటుగా జరుగుతున్నందున ధాన్యం సేకరణ ప్రక్రియ కాస్త ముందు, వెనుక జరుగుతుందని పేర్కొన్నారు.
ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే సేకరిస్తుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటివరకు 27 వేల మంది రైతుల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని చోట్ల ప్రభుత్వం అధిక ఎంఎస్పీMSP) చెల్లిస్తుందని గుర్తుచేశారు. అయితే, ధాన్యంలో తేమ లేకుండా రైతులు చూసుకోవాలని డీఎస్ చౌహాన్ సూచించారు. బయటరాష్ట్రాల నుంచి వచ్చే రైతులను అనుమతించబోమన్నారు.అందుకోసం 56 చెక్ పోస్టులను ఏర్పటు చేశామన్నారు. జూన్ 30 వరకు ధాన్యం సేకరణ ఉంటుందని, బ్యాంకు ద్వారానే డబ్బులు చెల్లిస్తామని, కావున రైతులెవరూ కంగారు పడొద్దని డీఎస్ చౌహాన్ సూచించారు.