షహీద్ గంగూ బాబా (Shaheed Gangu Baba)… గొప్ప మల్ల యోధుడు (Wrestler)… ఉత్త చేతులతో పులిని చంపిన గొప్ప ధైర్యవంతుడు. నానా సాహెబ్ సైన్యంలో చేరి బ్రిటీష్ సేనలను చీల్చి చెండాడిన గొప్ప వీరుడు. తన ఖడ్గంతో ఏకంగా 150 మంది బ్రిటీష్ సైనికులను మట్టు పెట్టిన గొప్ప పోరాట యోధుడు.
యూపీ కాన్పూర్ లోని బిత్తూరు గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించాడు. చిన్న తనంలో పేదరికం కారణంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించలేకపోయాడు. చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం చున్నాయి గంజ్ గ్రామంలో స్థిరపడింది. అక్కడ గంగూ బాబా కుస్తి నేర్చుకున్నాడు.
అతి తక్కువ కాలంలో గొప్ప మల్లయోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ రోజు అడవికి వెళ్లగా అతనిపై పులి దాడి చేసింది. దీంతో ఆ పులితో పోరాడి దాన్ని మట్టుపెట్టాడు. ఆ పులిని భుజంపై వేసుకుని వస్తుండగా నానా సాహెబ్ ఆయన్ని చూశాడు. వెంటనే తన సైన్యంలో చేరాలని గంగూ బాబాను కోరాడు.
నానా సాహెబ్ సైన్యంలో చేరేందుకు గంగూ బాబా ఒప్పుకున్నాడు. 19 జూలై 1857న బిత్తూరు కోటపై బ్రిటీస్ సేనలు దాడి చేశాయి. దీంతో గంగూ బాబా తన ఖడ్గంతో బ్రిటీష్ సేనలపై విరుచుకు పడ్డాడు. తన ఖడ్గంతో బ్రిటీష్ సేనలను ఊచ కోత కోశాడు. మొత్తం 150 మంది బ్రిటీష్ సైనికులను హత మార్చాడు. చివరకు బ్రిటీష్ సైన్యం చేతికి చిక్కాడు. దీంతో గంగూను ఓ గుర్రానికి కట్టేసి కాన్పూర్ మొత్తం ఊరేగించారు. అనంతరం చున్ని గంజ్ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరి తీసి చంపారు.