ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. మే 13న ఏపీ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. ఈ క్రమంలోనే టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) కూటమి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ చేసిన తప్పిదాలు, హామీల ఉల్లంఘన, అభివృద్ధిపై, అవినీతి పై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రతిపక్షాల మాటలకు అధికార పార్టీ ఇస్తున్న కౌంటర్లు ప్రజల్లోకి వెళ్లడం లేదని గ్రహించిన స్థానిక వైసీపీ నేతలు దాడులకు(Attacks) తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రచారం ముగించుకుని కారులో గురువారం రాత్రి ఇంటికి వెళ్తున్న జన సైనికులకు అడ్డగించి రాళ్లదాడి చేసినట్లు సమాచారం.
పల్నాడు జిల్లాలోని మించలపాడులో ఈ ఘటన జరగగా శుక్రవారం ఉదయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల 8వ వార్డుకు చెందిన బండారు రామయ్య బొలెరో వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఒకే రోజు రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
కచ్చితంగా ఈ పని వైసీపీ నేతలు చేశారని టీడీపీ, జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి గురించి ముందుగానే తెలిసి నిస్సహాయ స్థితిలో వైసీపీ గుండాలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదిలాఉండగా, తమపై దాడులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అనేవి స్వేచ్ఛా వాతావరణంలో జరగాలని, ఇలాంటి దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి చేటుచేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు.