తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana politics) ప్రస్తుతం జంప్ జిలానీల హవా నడుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల(Parliament elections)తో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే జంప్ జిలానీలు అన్ని పార్టీల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్లోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇక రీసెంట్గా గులాబీ గుర్తుపై గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad Mla Danam Nagender) ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఆయనకు ఏఐసీసీ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది.
అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఎంపీగా బరిలోకి దింపాలని కాంగ్రెస్ ఆలోచిస్తుండగా.. దానం మాత్రం ఎంపీగా గెలిచాకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మొండిపట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను ఎంపీగా ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద షరతు పెట్టారని కూటా టాక్ వినిపిస్తోంది.
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన దానంపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అయన్ను అనర్హుడిగా ప్రకటించాలని గులాబీ నేతలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానం రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయనతో రాజీనామా చేయిస్తే ఎంపీ ఎన్నికల్లో మైలేజ్ వస్తుందా? అని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.ఏదైనా ప్రస్తుతం దానం చేరిక ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారిందనేది ఆ పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతున్నది.