దేశంలో రాణి రుద్రమ దేవీ (Rudrama Devi), ఝాన్సీ లక్ష్మీ బాయి వంటి ఎందరో వీర వనితలు ఉన్నారు. అలాంటి వారిలో రాణి కర్ణావతి (Rani karnavati) ఒకరు. రాణా సంగా భార్యగా, రాణ విక్రమాదిత్య (Rana Vikramaditya), రాణా ఉదయ్ సింగ్ (Rana Uday singh) లాంటి వీరులకు తల్లిగా చరిత్రలో గొప్ప గుర్తింపు పొందారు.
అతి చిన్న వయస్సున్న తన ఇద్దరు కుమారులను తన తల్లి దండ్రుల ఇంటికి పంపించి మరి యుద్దంలో పాల్గొన్నారు. అది 1527… కాణ్వా యుద్దంలో అప్పటికే మేవాడ్ పాలకుడు రాణా సంగా మరణించారు. ఆయన కుమారు లిద్దరూ మైనర్లుగా వున్నారు. దీంతో రాజ్య పాలనను రాణీ కర్ణావతి చేపట్టారు. ఈ క్రమంలో గుజరాత్ పాలకుడు బహదూర్ షా కన్ను మేవాడ్ రాజ్యంపై పడింది.
ఎలాగైనా మేవాడ్ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే మేవాడ్ పై దండయాత్రకు బయలు దేరాడు. విషయం తెలుసుకున్న కర్ణావతి తన పొరుగు రాజుల మద్దతును కూడగట్టింది. బహదూర్ షాపై తన సైన్యంతో ముందుకు దూకింది. అత్యంత బలమైన బహదూర్ షా సైన్యాన్ని గట్టి సవాల్ విసిరింది. వందలాది మంది సైనికులను కర్ణావతి సైన్యం మట్టు పెట్టింది.
అయితే బహదూర్ షా సైన్యం ముందు కర్ణావతి సైన్యం చివరి దాకా నిలవలేక పోయింది. ఈ క్రమంలో పరాజయం తప్పదని రాణి కర్ణావతి తెలుసుకున్నారు. ఓటమిని ఒప్పుకోవడం కన్నా మరణమే ఉత్తమమని రాణి భావించారు. వెంటనే రాణి కర్ణావతి నేతృత్వంలో సుమారు 13000 మంది మహిళలు తమ ఒంటికి గన్ పౌడర్ పూసుకున్నారు. వెంటనే తమ ఒంటికి నిప్పంటించుకుని జౌహార్లు అర్పించారు.