Telugu News » Kaleshwaram : కాళేశ్వరంపై సర్కార్ దూకుడు…. ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు…!

Kaleshwaram : కాళేశ్వరంపై సర్కార్ దూకుడు…. ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు…!

ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు, పాలనాపరమైనా వైఫల్యాలపై శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది.

by Ramu
the telangana government will conduct an inquiry into the construction of the kaleshwaram project

గత బీఆర్ఎస్ (BRS) సర్కార్ వైఫల్యాలు, పాలనలో చేసిన పొరపాట్లను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎండగడుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు, పాలనాపరమైనా వైఫల్యాలపై శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు సర్కార్ రెడీ అవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే రివ్యూల మీద రివ్యూలు చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతులు తమ బాధ్యత కాదంటూ ఎల్ అండ్ టీ కంపెనీ రాసిన లేఖపై మంత్రి ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకువెళ్తామని చెప్పారు.

ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ సర్కార్ బయటపెడుతుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులో అవినీతికి కారణమైన అధికారులు, నిర్మాణ సంస్థలు, అప్పటి ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారా, దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారనే అంశంపై హాట్ చర్చ నడుస్తోంది.

దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. ఇది ఇలా వుంటే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టును ఈ నెల 29న సందర్శించనున్నారు. మేడిగడ్డ వద్దే మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించనున్నారు.

ప్రాజెక్టు నిర్వహణ కోసం ఎంత విద్యుత్తు, అవసరం అవుతుంది..? ఎకరాకు నీరు అందించేందుకు ఎంత ఖర్చవుతుంది..? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎవరికి లబ్ది చేకూర్చింది. అసలు ప్రాజెక్టును ఎందుకు నిర్మించారు వంటి పలు అంశాలపై ప్రజలకు మంత్రులు సవివరంగా పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించి వాటిపై సమీక్ష నిర్వహించనున్నారు.

 

You may also like

Leave a Comment