తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నాయకుల విమర్శ, ప్రతి విమర్శలతో హోరెత్తుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలాగైనా మైలేజ్ సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త రకం ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి డబుల్ డిజిట్ దక్కుతుందని ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేశాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం మూడో స్థానానికే పరిమితం కాబోతుందని సర్వే సంస్థలు స్పష్టంచేశాయి.
ఈ క్రమంలోనే సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy)..తనపై కుట్ర జరుగుతోందని, పదవి నుంచి తప్పించడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy)మంగళవారం స్పందించారు.
సీఎం రేవంత్‌కు బీజేపీతో ఎటువంటి అపాయం లేదని.. ఆయనకు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలతోనే ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెట్టమని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. కానీ, ఐదేండ్ల తర్వాత మాత్రం తెలంగాణలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలుస్తుందని, మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారన్నారు.