మాతా బాగ్ కౌర్ (Matha Bhag Kaur) …. ఔరంగ జేబు (Aurangazeb) సేనలను హడలెత్తించిన వీర నారీమణి. భయంతో వెనకడుగు వేసిన సిక్కు సైన్యంలో సత్తువ నింపి ముందుకు నడిపిన ధైర్య శాలి. 40 మంది సైన్యంతో పదివేల మంది ఉన్న మొఘల్ సైన్యాన్ని (Mughal Army) ముప్పు తిప్పలు పెట్టిన వీర మహిళ. సైన్యం మొత్తం మరణించినా సివంగిలా ఔరంగజేబు సైన్యాన్ని చీల్చి చెండాడిన ఆడ బెబ్బులి ఆమె.
అది 1704వ సంవత్సరం… ఔరంగజేబు సేనలు ఆనంద్ పూర్ సాహిబ్‌ను చుట్టు ముట్టాయి. ఆనంద్ సాహిబ్ ను విడిచి పెట్టి వెళ్లి పోవాలని సిక్కులకు అల్టిమేటం జారీ చేశాయి. దీంతో 40 మంది సిక్కులు గురు గోవింద్ సింగ్‌ను విడిచి పెట్టి ఆనంద్ పూర్ నుంచి వెళ్లిపోయారు. మొఘల్ సైన్యానికి బయపడి ఇస్లాంలోకి మారేందుకు రెడీ అయ్యారు.
తన భర్త, సోదరునితో సహా 40 మంది సిక్కులు మొఘల్ సైన్యానికి తల వంచారని తెలుసుకుని ఆమె ఆగ్రహంతో రగిలి పోయారు. ఓటమిని ఒప్పుకోవడం కన్నా చచ్చి పోవడం మేలంటూ సిక్కుల్లో స్ఫూర్తిని నింపారు. ఆ 40 మంది సిక్కు సైన్యంతో మళ్లీ ఆనంద్ పూర్ సాహిబ్ వైపు అడుగులు వేశారు. ఔరంగ జేబు సైన్యంపై సిక్కులు సింగంలాగా దూకారు.
ఔరంగజేబు సైన్యాన్ని సిక్కులు ఊచ కోత కోశారు. సిక్కుల పరాక్రమం ముందు తాళలేక మొఘల్ సేనలు చెల్లా చెదురయ్యాయి. ఈ పోరాటంలో చివరకు 40 మంది సిక్కులు మరణించారు. ఈ క్రమంలో మాతా బాగ్ కౌర్ కత్తి చేత పట్టి కదన రంగంలో దూకింది. మిగిలిన మొఘల్ సైన్యాన్ని చీల్చి చెండాడింది. దీంతో మొఘల్ సేనలు తోక ముడిచాయి.