కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ (BR Patil) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హిందూ ఓట్ల కోసం బీజేపీ (BJP) మత ఘర్షణలు రెచ్చే గొట్టే అవకాశం ఉందంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాషాయ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఆ వీడియోలో బీజేపీపై బీఆర్ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలవాలని బీజేపీ అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రామ్ మందిర్ పై బాంబు దాడి చేసి దాన్ని ముస్లిం వర్గాలపై నెట్టే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారనే దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వలేదు.
బీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. హిందు- ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తోందని పేర్కొంది. హిందూయిజం పునాదులను ప్రశ్నించేందుకు బయలు దేరిన హస్తం పార్టీ ఇప్పుడు రామ మందిరాన్ని దుష్ట బుద్దితో చూస్తోందని మండిపడింది.
రామ మందిరాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించడం ద్వారా హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పుడు ముందుగానే ఆ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ పొరబాటున బయట పెట్టేశారంటూ వ్యాఖ్యలు చేసింది.