కల్నల్ వీర్ నిజాముద్దీన్ (COLONEL VEER NIZAMUDDIN)…. బ్రిటీష్ సైన్యంలో పని చేస్తూ సైనికాధికారిని కాల్చి చంపిన భారతీయ సిపాయి. నేతాజీ సుభాష్ చంద్రబోసు (Netaji Subash Chandra Bose)కి అత్యంత నమ్మకస్తుడు. నేతాజీ దగ్గర డ్రైవర్, అంగరక్షకునిగా పని చేసిన వ్యక్తి. నేతాజీతో కలిసి బర్మా అడవుల్లో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేతాజీని కాపాడిన గొప్ప దేశ భక్తుడు.
యూపీలోని అజమ్ ఘర్ ప్రాంతంలో సైఫుద్దీన్ జన్మించారు. బ్రిటీష్ సైన్యంలో చేరాలనే కోరికతో 20 ఏండ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయారు. అనుకున్నట్టుగానే బ్రిటీష్ సైన్యంలో చేరారు. అక్కడ భారతీయ సైనికులను కించ పరుస్తూ బ్రిటీష్ సైనికాధికారి చేసిన వ్యాఖ్యలు సైఫుద్దిన్ చెవిన పడ్డాయి. దీంతో ఆ అధికారిని కాల్చి చంపి అక్కడి నుంచి సింగపూర్ పారి పోయారు.
ఆ తర్వాత నిజాముద్దీన్ గా పేరు మార్చుకుని అజాద్ హిందు ఫౌజ్‌లో చేరారు. అతి తక్కువ కాలంలోనే నేతాజీకి నమ్మిన బంటుగా మారారు. నేతాజీ కారు డ్రైవర్ గా పని చేస్తూ ఎప్పటికప్పుడు ఆయనకు అంగ రక్షకునిగా పని చేశారు. 1943-1944లో బర్మాలో నేతాజీతో కలిసి బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్దం చేశారు. 1943లో ఓ సారి అడవిలో బ్రిటీష్ సైనికులు రహస్యంగా తుపాకీ గురి పెట్టి నేతాజీని కాల్చి చంపే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని గమనించిన నిజాముద్దీన్ వెంటనే నేతాజీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేశాడు. ఆ సమయంలో నాలుగు బులెట్లు ఆయన ఛాతీలోకి దూసుకు పోయాయి. ఆ తర్వాత నిజాముద్దీన్ ను కాపాడి ఆయన శరీరంలోని బుల్లెట్లను కెప్టెన్ లక్ష్మీ సెహగల్ తొలగించారు. నిజాముద్దీన్ ధైర్యాన్ని, అంకిత భావాన్ని చూసి సంతోష పడిన నేతాజీ అప్పటి నుంచి నిజాముద్దీన్ ను తన వెంట తీసుకు వెళ్లేవారు. స్వతంత్ర్య అనంతరం 1969లో తన స్వగ్రామంలో ఆయన సెటిల్ అయ్యారు. 2017లో ఆయన మరణించారు.