డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti vikaramrkha) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరినీ సర్వే చేస్తామన్నారు. తెలంగాణ (Telangana)లో కేవలం బీసీ కులగణన మాత్రమే కాకుండా అన్ని కులాలను సర్వే చేస్తామని వెల్లడించారు. జనాభా దామాషా ప్రకారం సర్వే చేయిస్తామని అన్నారు.
ప్రతి ఇంటి సర్వే నిర్వహించి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో బీసీ కులగణనపై జరిగిన చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ….. భారత్ లోనే ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు.
ఈ సర్వే దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులకు పునాదిగా మారబోతున్నదని వెల్లడించారు. అటువంటి తీర్మానాన్ని తమ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ సర్వే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని కన్ఫ్యూజన్ ఉన్నదల్లా బీఆర్ఎస్ కేనన్నారు.
తెలంగాణ నుంచే కుల గణన చేపడతామని గతంలో రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. అన్నట్టుగానే కుల గణనను చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో సంపద అంత ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది? ఆ సంపదను జనాభా దామాషా ప్రకారం పంపిణీ ఎలా చేయాలో అనేది అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ సర్వే అనంతరం అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.