పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(CONGRESS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొందరు నేతలు ఏకంగా సవాళ్లు విసురుకుంటూ ప్రజల అటెన్షన్‌ను పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. మీ హయాంలో ఏం చేశారంటూ అంటూ అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్‌గా తన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నది.
ఈ క్రమంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(BJP MP Candidate Raghunandan Rao) బీఆర్ఎస్ పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెదక్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు.
త్వరలోనే బీఆర్ఎస్ ముఖ్య కీలక నేతలైన హరీశ్ రావు, కేటీఆర్, ప్రస్తుత మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఈ ముగ్గురూ పక్కా జైలుకు వెళ్లక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వీరు చేసింది ఏమీ లేదన్నారు.
ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ పెద్దలు తనతో చర్చకు రావాలని రఘునందన్ రావు సవాల్ విసిరారు. దేశంలో ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా.. మూడోసారి ప్రధాని మోడీ విజయం తథ్యమని.. ఆయన మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని రఘనందన్ రావు ధీమా వ్యక్తంచేశారు.