ఖమ్మం అంటే తుమ్మల…తుమ్మలంటే ఖమ్మం. అలాంటి తుమ్మలకు బీఆర్ఎస్ పార్టీనుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆశించిన చోట సీటు ఇవ్వకుండా మరొకరికి కట్టబెట్టడంతో తుమ్మల నాగేశ్వర్రావు ఉనికి ప్రశ్నార్థంకంగా మారింది.
ఆది నుంచీ ఎదురులేని మనిషిగా ఎదిగిన తుమ్మలకు ఇది కాస్తా మింగుడు పడకపోవడంతో బీఆర్ఎస్ జెండాలు లేకుండానే తుమ్మల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇండిపెండెంట్ గానే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావిస్తున్నారు.
ర్యాలీలో భాగంగా హైదరాబాద్(Hyderabad) నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం చేరుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుకు నాయకన్ గూడెం(Nayakan Goodem) వద్ద ఆయన అనుచరులు భారీగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పాలేరు(Paaleru)టికెట్ ఆశించారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు టికెట్ ను కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో తుమ్మల అనుచరులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన్ను పార్టీ మారాల్సిందిగా అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో భారీ బలప్రదర్శన చేస్తున్నారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మంలోని తన నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఈ ర్యాలీ తర్వాత…ఖమ్మంలో ముఖ్య నేతలు, అనుచరులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు తుమ్మల. బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్ లో తుమ్మల కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత…. కొంత సైలెంట్ అయ్యారు తుమ్మల. ఆయనకు ఎమ్మెల్సీ(Mlc)పదవి వస్తుందని అనుచరులు, ముఖ్య నేతలు భావించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తిరిగి కందాలకే టిక్కెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్.