తిలేశ్వరీ బారువా (Telishwari Baruva) .. దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన ధీర బాలిక. తన తోటి పిల్లలంతా పుస్తకాలతో పోటీ పడుతుంటే తాను మాత్రం పోరు బాట పట్టింది. బ్రిటీష్ వారిని ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పై మువ్వన్నెలా (Indian Flag) జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించి మృత్యువును ముద్దాడింది.
అది, 1942 క్విట్ ఇండియా ఉద్యమ రోజులు. గాంధీజీ పిలుపు మేరకు దేశ ప్రజలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే, బ్రిటీష్ వ్యతిరేక నినాదాలు తిలేశ్వరీ బారువాలో పోరాట స్ఫూర్తిని పెంచాయి. తన తోటి పిల్లలంతా ఆట పాటలతో ఆనందంగా గడుపుతుంటే తాను మాత్రం పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగింది.
మృత్యు వాహిని(ఆత్మహుతి దళం) వెంట అడుగులో అడుగు వేసుకుంటూ దేకియా జౌళి పోలీస్ స్టేషన్ (అసోం)పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు వెళ్లింది. పోలీసులు హెచ్చరికలను లెక్క చేయకుండా జాతీయ జెండాను పట్టుకుని ముందుకు కదిలింది. ఆగ్రహించిన పోలీసులు ఆందోళనకారులపై తూటాల వర్షం కురిపించారు.
కళ్లు మూసి తెరిచేలోపు తూటాలు తెలీశ్వరీ గుండెలను చీల్చుకుంటూ దూసుకుపోయాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె దేశ భక్తిని అసోం ప్రభుత్వం గుర్తించింది. దేకియా జౌళి పోలీస్ స్టేషన్ ను వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. తిలేశ్వరీ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరిలో ప్రధాని మోడీ దేకియా జౌళిని సందర్శించారు. అప్పటి కాల్పుల ఘటనలో అమరులైన తిలేశ్వరీ బరువాతో పాటు ఇతర అమరులకు నివాళులు అర్పించారు.