తిరుమల ( Tirumala) శ్రీవారికి మరోసారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) నిర్వహించనున్నారు. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్స వాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇప్పుదు దసరా సందర్బంగా ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనుంది. ప్రతి సంవత్సరంలో స్వామి వారికి ఒక సారి మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది అధిక మాసం రావడంతో మరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ సంవత్సరం అధిక మాసం వస్తుందని వేదపండితులు చెబుతున్నారు. ఇలా అధిక మాసం వచ్చిన సమయంలో భాద్రపద మాసంలో స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్యయుజ మాసంలో దసరా నవరాత్రుల సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ ఏడాది అధిక మాసం నేపథ్యంలో నవరాత్రి బ్రహ్మోత్స వాలను నిర్వహించేందుకు టీటీడీ రెడీ అవుతోంది.
ఇప్పటికే నవరాత్రుల బ్రహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్ ను టీటీడీ విడుదల చేసింది. ఇక సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పోలిస్తే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ఉండదని టీటీడీ పేర్కొంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 15 మొదటి రోజున రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆ తర్వాత 16న ఉదయం 8 నుంచి 10 వరకు చిన్న శేష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహనం, 17న ఉదయం 8 నుంచి 10 వరకు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు ముత్యపు పందిరి, 18న ఉదయం 8 నుంచి 10 వరకు కల్ప వృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు సర్వ భూపాల వాహనం, 19న ఉదయం 8 నుంచి 10 వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి 9 వరకు గరుడ వాహన సేవలను నిర్వహించనున్నారు.
20న ఉదయం 8 నుంచి 10 వరకు హనుమద్ వాహనం, పుష్పక విమానం(సాయంత్రం 04:00 నుంచి ఆ తర్వాత గజ వాహనం, 21న ఉదయం 8 నుంచి 10 వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనం, 22న ఉదయం 8 నుంచి 10 వరకు స్వర్ణ రథం , రాత్రి 7 నుంచి 9 వరకు అశ్వ వాహనం,
23న అఖిలాండ నాయకుడికి చక్ర స్నానం నిర్వహించనున్నారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకార, ఊంజల్ సేవ, సేవలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతించనున్నారు.