షహీద్ అనంత్ లక్ష్మణ్ కన్హరే (Anant Laxman Kanhere)… గొప్ప విప్లవ పోరాట యోధుడు. అభినవ భారత్ (Abhinav Bharat)విప్లవ సంస్థ సభ్యుడు. నాసిక్ జిల్లా కలెక్టర్ జాక్సన్ ను హత మార్చిన విప్లవ వీరుడు. నాసిక్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యారు. హత్య గురించి కోర్టులో నిర్భయంగా వెల్లడించిన గొప్ప ధైర్యవంతుడు. 18 ఏండ్ల వయస్సులోనే ఉరిశిక్ష అనుభవించిన భరత మాత ముద్దు బిడ్డ.
7 జనవరి 1892లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంజని గ్రామంలో జన్మించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నిజామాబాద్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1908లో ఔరంగబాద్‌లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే రహస్య విప్లవ సంస్థ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు.
అనంతరం నాసిక్ జిల్లా కలెక్టర్ జాన్సన్ ను హత్య చేయాలని విప్లవ సంస్థలు నిర్ణయించాయి. కలెక్టర్ జాన్సన్ తనను తాను గత జన్మలో ఓ బ్రహ్మణుడిని అని చెప్పుకుంటూ స్థానికులతో కలిసి మెలిసి స్నేహంగా ఉంటున్నట్టు ప్రజలను నమ్మించే వారు. అలా వారితో కలిసి ఉంటూ విప్లవ సంస్థల్లో పని చేసే వారి సమాచారం తెలుసుకుంటూ వారిని అరెస్టు చేయించే వారు.
విషయం తెలుసుకున్న విప్లవకారులు ఎలాగైనా జాన్సన్ ను హత్య చేయాలని అనుకున్నారు. పదోన్నతిపై జాన్సన్ వేరే ప్రాంతానికి వెళ్తున్నారని విప్లవకారులు తెలుసుకున్నారు. విజయానంద్ థియేటర్‌లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి జాన్సన్ ను స్థానికులు సన్మానించారు. ఆ థియేటర్ లోకి ప్రవేశించిన కన్హరే వెంటనే జాన్సన్ పై కాల్పులు జరిపాడు. దీంతో జాన్సన్ అక్కడికక్కడే మరణించారు.
అక్కడ ఉన్న పోలీసులు కన్హరే పట్టుకున్నారు. అనంతరం ఆయన్ని న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారణ సందర్బంగా ఈ హత్య తానే చేసినట్టు ధైర్యంగా కన్హరే ఒప్పుకున్నారు. దీంతో ఆయనకు ఉరిశిక్ష విధించారు. 29 మార్చి 1910లో థానే జైలులో ఆయన్ని ఉరి తీశారు. ఆయనతోపాటు కృష్ణ జీ కార్వే. వినాయక్ దేశ్ పాండేలు కూడా ఉరి కంబం ఎక్కారు.