కర్ణాటక (Karnataka)లో బాణ సంచా దుకాణం (Firecracker Shop) లో జరిగిన అగ్ని ప్రమాదం (Fire Accident)లో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరినట్టు పోలీసులు (Police) తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తుల్లో ఇద్దరు మరణించినట్టు పేర్కొన్నారు.
కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని అట్టిబెలె ప్రాంతంలో ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సెయింట్ జార్జ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి, ఆక్స్ ఫర్డ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
బాణసంచా దుకాణం యజమానికి కుమారుడు నవీన్ రెడ్డితో మరో ఇద్దరిని సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. వారికి 30 వరకు కాలిన గాయాలు వున్నాయని వైద్యులు తెలిపారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. మృత దేహాలను గుర్తించడం ఇబ్బందిగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
మృతులను ప్రకాష్ (20), వెట్టప్పన్ (25), కేశవన్ (23), విజయ రాఘవన్ (20), ఇల్లం బరుతి (19), ఆకాశ్ (23), గిరి (22), సచిన్ (22), ప్రభాకరణ్ (17), వసంత్ రాజ్ (23), అప్పాస్ (23)లుగా గుర్తించామన్నారు. మిగత మృత దేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మృతుల్లో ఎక్కువగా బాణ సంచా దుకాణ సిబ్బంది ఉన్నట్టు చెప్పారు.