అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట (Consecration) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. తాజాగా విపక్ష నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు విశ్వహిందూ పరిషత్ (VHP)వెల్లడించింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అదిర్ రంజన్ చౌదరి, జేడీఎస్ నేత దేవేగౌడను ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్టు వీహెచ్ పీ నేత అలోక్ కుమార్ వెల్లడించారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చకా చకా సాగుతున్నాయని తెలిపారు. జనవరి 15 వరకు అన్ని అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రాణ ప్రతిష్ట జనవరి 16న ప్రారంభమై 22న ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా హాజరు కాబోతున్నారని పేర్కొన్నారు.
రాంపథం, భక్తి పథం, సుగ్రీవ కోటలో అలంకరణలు చివరి దశలో ఉన్నాయి. గోడలకు టెర్రకోట, చక్కటి మట్టి కుడ్య కళాఖండాలతో అలంకరిస్తున్నారు. ధర్మ మార్గం వైపు గోడలపై రామాయణ సంఘటనలను వర్ణించే కుడ్య చిత్రాలను గీస్తున్నారు. త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చే కళాఖండాలతో గోడలను అలంకరిస్తున్నట్టు అధికారులు వివరించారు.
సహదత్గంజ్కు వెళ్లే 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని రాంపత్ పేరుతో పిలుస్తున్నారు. 40 అడుగుల వెడల్పులో ఈ రోడ్డు ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సంస్థలు, భవనాలు, దుకాణాలకు రంగులు వేశారు. రామ మందిరం ప్రధాన ద్వారాన్ని ‘శ్రీరామ జన్మభూమి మార్గం’గా పిలుస్తున్నారు. 90 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డులో లైటింగ్, పందిరి పనులు జరుగుతున్నాయి.
నయాఘాట్ వద్ద ఉన్న రామకథా మ్యూజియంలో కూడా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అయోధ్యలో భారీ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. ఆధునిక ఆర్కిటెక్చర్, అన్ని సౌకర్యాలతో కూడిన ఈ స్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.