Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ (Palamuru-Rangareddy Lift Irrigation) ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR) ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఇది తరతరాల ఎదురు చూపులు ఫలించన వేళ అని అన్నారు. పల్లేర్లు మొలిచిన పాలమూరు (Mahabubnagar) లో పాలనురగల జల సవ్వడి నెలకొందని చెప్పారు. వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమైందని.. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం చేస్తోందని అన్నారు.
‘‘శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు.. బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు.. స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం.. ఆరు జిల్లాలు సస్యశ్యామలం’’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. అంతేకాదు, దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం జరుగుతోందని.. ఒకప్పుడు పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్.. ఇప్పుడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్నారని తెలిపారు. ఆనాడు.. నది పక్కన నేల ఎడారిలా ఎండిన విషాదం ఉండేదని.. సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపమే ఇందుకు కారణమని విమర్శించారు.
బిరబిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం చేశామన్నారు కేటీఆర్. ఆటంకాలు, అవరోధాలు అధిగమించి.. ప్రతి పక్షాల కుట్రలు, కేసులు ఛేదించి.. సవాల్ చేసి విజయం సాధించామని వ్యాఖ్యానించారు. ‘‘నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం.. అనుమతుల్లో అంతులేని జాప్యం.. ఐనా.. కేంద్ర సర్కారు కక్షను, వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం ఇది. తీరిన దశాబ్దాల నీటి వెత.. తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత’’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.





