Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
2001 డిసెంబర్ 13.. పార్లమెంట్ (Parliament) పై దాడి జరిగిన రోజు. సరిగ్గా ఇదే రోజున ఇద్దరు వ్యక్తులు లోక్ సభ (Lok Sabha) లో నానా రచ్చ చేశారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు కిందకు దూకి గ్యాస్ ను వదలడం కలకలం రేపింది. సెక్యూరిటీ (Security) సిబ్బంది వారిని పట్టుకుని విచారించగా.. వారు నీలం, అమోల్ షిండే అని తేలింది. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. జీరో అవర్ సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇద్దరు వ్యక్తులు నియంతృత్వం పని చేయదు అంటూ నినాదాలు చేశారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karthi Chidambaram) స్పందించారు. సభ జరుగుతుండగా అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి పసుపు రంగు గ్యాస్ ను వదిలారని చెప్పారు. వారు కొన్ని నినాదాలు చేశారని, వారు వదిలిన గ్యాస్ విష వాయువు కావచ్చని, ఇది తీవ్ర భద్రతా వైఫల్యమని పేర్కొన్నారు.
శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ (Aravind Sawanth) స్పందిస్తూ.. ఆగంతకుల దుశ్చర్యతో సభలో కలకలం రేగిందన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు పైనుంచి కిందకు దూకినప్పుడు చివరి బెంచీల్లో సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారిని సులభంగా పట్టుకున్నారని అన్నారు.
ఈ అనుభవం చాలా భయానకంగా ఉందని ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని సస్పెండ్ అయిన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ చెప్పారు. ‘‘సంఘటన చాలా తీవ్రమైనది ఎందుకంటే పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు అవుతోంది. అదే రోజు ఇటువంటి భద్రతా లోపం బట్టబయలు కావడం ఆశ్చర్యకరం’’ అని అన్నారు.
ఎంపీ రాజేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి దూకినప్పుడు కిందపడిపోయినట్లు అనిపించిందని అన్నారు. దీని తర్వాత మరొక వ్యక్తి దూకినప్పుడు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలిందని చెప్పారు. ఒక వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయగా మరొకరు బెంచ్ ను కొట్టారు. వీరి ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియ లేదని, అయితే వారు ఏదో ఆలోచనతో వచ్చారని అన్నారు.
పార్లమెంట్ బయట కూడా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. ఒక పురుషుడు, మహిళ నినాదాలు చేస్తూ కనిపించారు. పోలీసులు వారిద్దరినీ అక్కడి నుంచి తీసుకెళ్లారు. వీళ్లు టపాసులు కాల్చుతూ నినాదాలు చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరినీ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.