దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. గత కొద్దిరోజులుగా రాజకీయ నాయకులు, పోలీసులపై గురి పెట్టి వారి ఎక్స్, ఫేస్ బుక్, వాట్సప్ లను హ్యాక్ చేస్తు చుక్కలు చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) గవర్నర్ (Governor) తమిళిసై (Tamilisai) ఎక్స్ (X) అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే..
ఈ విషయాన్ని రాజ్ భవన్ అధికారులు గుర్తించి హైదరాబాద్ (Hyderabad) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ముంబై (Mumbai) నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బొటిక్ నిర్వాహకురాలిని సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులు విచారించారు.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా మూసి ఉన్న బొటిక్ షాప్ నుంచి ఈ క్రైమ్ జరిగినట్లు గుర్తించారు.. నిర్వాహకురాలిని ప్రశ్నించినప్పటికి కావలసిన పూర్తి సమాచారం తెలియకపోవడంతో మరోకోణంలో విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణకు చెందిన కీలక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
మరోవైపు గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోషల్ మీడియా అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయి. ఇలా రాజకీయ ముఖ్య నేతల ట్విట్టర్ ఖాతాలు సైబర్ నేరస్తులు ఎందుకు హ్యాక్ చేస్తున్నారనేది తెలియడం లేదని అంటున్నారు.. వారి పూర్తి వివరాలు.. ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలు తెలుసుకొని ఏదైనా ప్లాన్ చేయడానికి సిద్ధం అవుతున్నారా? అనే అనుమానాలు అధికారులు వెలిబుచ్చుతున్నారు.