ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. అర్ధరాత్రి బొలెరో(Bolero) వాహనం 200 మీటర్ల గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని బేతాల ఘాట్ డెవలప్మెంట్ బ్లాక్ లోని ఉంచకోట ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
మృతులు తిలక్ చౌదరి (45), గోపాల్ (60), రామ్ చౌదరి (50), ధీరజ్ (45), అనంత్ రామ్ చౌదరి (40), వినోద్ చౌదరి (38), ఉదయ్ రామ్ చౌదరి (55)గా గుర్తించారు. ఛోటూ చౌదరి శాంతి చౌదరి గాయపడ్డారు. నేపాల్ మూలానికి చెందిన 10 మంది వ్యక్తులను తనకూర్కు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
జల్ జీవన్ మిషన్ కింద పని చేయడానికి వీరంతా ఉంచకోటక్కు వచ్చారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. వాహనం పడిపోయిన శబ్దం విని చుట్టుపక్కల వారు సంఘటనాస్థలికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో పోలీసులు బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.