తిరుమల (Tirumala) లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Brahmosthavalu) కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఈ రోజు ఉదయం చక్రస్నానం (Chakra Stannam) పూర్తయ్యింది, సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని వేద పండితులు వివరించారు.
వేంకటేశ్వర స్వామి నామస్మరణతో…గోవింద నామాలతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి. కలియుగ దైవంగా భావించే వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కృపకటాక్షం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి సేవ చేస్తే ఆ తిరుమలేశుడి కృప తమపై ఎల్లవేళలా ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాల సమయంలో భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించామని టీటీడీ అధికారులు చెప్పారు.
మంగళవారం ఉదయం జరిగిన చక్రస్నానం, రాత్రి జరగనున్న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ చైర్మెన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లల్లో భక్తిభావం పెంపొందించడానికి టీటీడీ ప్రారంభించిన ‘గోవింద కోటి’ రాసి యువత తరించాలని ఆయన అన్నారు.
బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యాక సుదర్శనస్వామిని ముందు ఉంచుకొని పుష్కరిణిలో తీర్థమాడటమే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అంటారు. బ్రహ్మోత్సవం అంటే యజ్ఞం.. యజ్ఞం పూర్తి చేయగానే అవభృధ స్నానం చేయాలి. భృధం అంటే బరువు…అవ అంటే దించుకోవడం అని అర్థం. ఇన్ని రోజులు యజ్ఞం చేసి అలిసిపోయిన వాళ్లు ఆ అలసట, బరువును స్నానంతో ముగించుకుంటారు. చక్రస్నానం రోజు సుదర్శనస్వామి, మలయప్పస్వామితో కలిసి స్నానం చేయడమంటే జన్మల పుణ్యఫలమని భక్తుల విశ్వాసం.