ఒక మనిషికి ప్రాణం పోయడం కష్టం కానీ.. ప్రాణం తీయడం.. లేదా.. ప్రాణం తీసుకోవడం ఏమంత పని కాదని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి.. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు చావే పరిష్కారంగా మనషుల ఆలోచనలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక మస్తాపానికి గురై ముగ్గురు.. అనారోగ్య సమస్యతో ఒకరు.. వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.. ఆ వివరాలు చూస్తే..
అనారోగ్యంతో విసిగిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ (Sarangapur) మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. బీడీ కార్మికురాలిగా పనిచేసి జీవనం సాగిస్తున్న అలగొండ విజయలక్ష్మి(20) గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు S1 చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. తమిళనాడు (Tamil Nadu), తేని (Theni)జిల్లా, చిన్నమనూరు (Chinnamanur)కు చెందిన రాజేష్ (30) అనే యువకుడు EMI పద్దతిలో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే అతడు వాయిదా సరిగ్గా చెల్లించకపోవడంతో లోన్ రికవరీ ఏజెంట్ వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..