భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో 1857 తిరుగుబాటు (1857 Revolt) అనేది అత్యంత ప్రధానమైనది. ఈ తిరుగుబాటులో తెలంగాణ నుంచి ఎంతో మంది పోరాట యోధులు పాల్గొన్నారు. బ్రిటీష్ చెర నుంచి భారత్ కు విముక్తి కలిగించేందుకు వాళ్ల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారు. దురదృష్టవశాత్తూ వాళ్లలో చాలా మందిని చరిత్ర గుర్తించలేదు. అలాంటి పోరాట యోధుల్లో మౌల్వీ అల్లావుద్దీన్ (Maulvi Syed Allauddin)ఒకరు.
1824లో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈయన జన్మించారు. అసలు పేరు సయ్యద్ అల్లావుద్దీన్ హైదర్. తండ్రి హఫిజుల్లా. ఈయన ఓ మత ప్రభోదకుడు. పర్షియన్, ఉర్దూ, తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. 1857 మే 10న యూపీలోని మీరట్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయింది.
క్రమంగా ఈ తిరుగుబాటు దేశమంతటికీ వ్యాపించింది. ఈ క్రమంలో తెలంగాణలో 1857 తిరుగుబాటులో మౌల్వీ అల్లావుద్దీన్ పాల్గొన్నారు. జమీందార్ చిడ్డాఖాన్ ను అరెస్టు చేసి హైదరాబాద్ లోని బ్రిటీష్ రెసిడెన్సీ భవనంలో బంధించారు. దీంతో చిడ్డాఖాన్ ను ఎలాగైనా విడిపించాలని మౌల్వీ అనుకున్నారు.
17 జూలై 1857న తన స్నేహితుడు తుర్రేబాజ్ ఖాన్ తో పాటు 500 మంది స్వాతంత్ర్య సమరయోధులతో కలిసి బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేశారు. ఆ తర్వాత తుర్రేబాజ్ ఖాన్ ను బ్రిటీష్ అధికారులు అరెస్టు చేయగా మౌల్వీ తప్పించుకున్నారు. తన పోరాటాన్ని కొనసాగిస్తూ బ్రిటీష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. చివరకు ఆయన్ని బ్రిటీష్ సైన్యం బంధించింది. 25 అగస్టు 1859న జీవిత ఖైదు విధించారు. తర్వాత అండమాన్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో శిక్ష అనుభవిస్తూనే మరణించారు మౌల్వీ అల్లావుద్దీన్.