దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan)లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతోంది. భారీ వర్షాల(Heavy Rains) కారణంగా దేశంలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది.గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
భారీ వర్షాలకు తోడు పాక్‌లోని కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోల్, పెషావర్, బెలూచ్ ప్రావీన్సులను భారీ వరదలు ముంచెత్తాయి.ఈ ప్రకృతి విపత్తుల కారణంగా పాకిస్తాన్లో ఇప్పటివరకు సుమారు 87 మంది మరణించినట్లు సమాచారం.
అంతేకాకుండా మరో 80 మందికి పైగా గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా 2,715 ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరదల(Heavy Floods) కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ, రోడ్లు, రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
కాగా, దేశంలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల బీభత్సంపై పాక్ జాతీయ విపత్తు సంస్థ అలర్ట్ అయ్యింది.వర్షాలు,వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాచక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్షతగాత్రులకు వైద్య సాయం అందజేస్తున్నారు. వర్షాల కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.