ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కారులో ఊపిరాడక బాలుడు (Boy died)మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు ఏమర పాటుగా ఉంటే రెప్పపాటులో ఇలాంటి విషాద ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని మరోసారి రుజువైంది. బాలుడి మృతికి సంబంధించి పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకివెళితే. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక దంపతులు కొడుకు రాఘవ(6)తో కలిసి రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లింది. తల్లి పనిలో నిమగ్నమై ఉండగా రాఘవ ఆడుకునేందుకు అని వెళ్లి తిరిగి రాలేదు.
బాలుడు ఎంతకూ తిరిగి రాకపోయే సరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం గాలించారు. చివరకు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే, రెండు రోజుల తర్వాత మిస్సయిన బాలుడు ఓ కారులో చలనం లేకుండా కనిపించాడు. యాజమాని ఫిర్యాదుతో పోలీసులు వచ్చి బాలుడిని గుర్తించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు పోలీసులు నిర్దారించారు. అయితే, ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు కారు డోర్లు తెరచి ఉన్న సమయంలో లోనికి వెళ్లి ఉంటాడని, కార్ డోర్స్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు.
రెండురోజులుగా బయటకు వెళ్లకపోవడంతో అందులో బాలుడు ఉన్నట్లు గుర్తించలేదని కారు యాజమాని తెలిపారు. అతని వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బాలుడిని ఎవరైనా కావాలనే కారులోకి పంపించి లాక్ వేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.