గాజా (Gaza)హిళలు, పసిపిల్లలపై హత్యా కాండను ఆపి వేయాలంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెత న్యాహు (Benjamin Netanyahu)తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ హత్య కాండకు హమాస్ బాధ్యత వహించాలన్నారు. దీనికి ఇజ్రాయెల్ ను బాధ్యులుగా చేయడం సరికాదని మండిపడ్డారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో హమాస్ మారణకాండ సృష్టించిందన్నారు. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు ఊచకోత కోసారని వెల్లడించారు. పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేయడం లేదన్నారు. హమాస్ మిలిటెంట్లు అత్యంత దారుణంగా ఇజ్రాయెల్ లో పౌరుల తలలను తెగనరికారని, సజీవదహనం చేశారని, పౌరులను ఊచకోత కోశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పౌరులకు హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ అన్ని రకాలు చర్యలు తీసుకుంటుంటే, పౌరులకు హానికలిగించేందుకు హమాస్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గాజాలో మానవతా కారిడార్లు, సేఫ్ జోన్లను ఇజ్రాయెల్ అనుమతించిందన్నారు. కానీ హమాస్ మాత్రం తుపాకీతో వాటిని అడ్డుకున్నారని తెలిపారు.
పౌరులను అడ్డు పెట్టుకుని పౌరులను లక్ష్యంగా చేసుకుని హమాస్ దాడులు చేస్తోందన్నారు. అందువల్ల ఈ ద్వంద్వ యుద్ధ నేరాలకు హమాస్ బాధ్యత వహించాలన్నారు. హమాస్ మిలిటెంట్లను ఓడించడంలో నాగరికత శక్తులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవాలని అంతర్జాతీయ సమాజానికి నెతన్యాహూ పిలుపునిచ్చారు.