-ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం
-ఇది చారిత్రాత్మక నిర్ణయం
-అన్ని వర్గాలపై సర్వే చేస్తాం
-రేవంత్ రెడ్డి వెల్లడి
-నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-దీనిపై బిల్లులు తీసుకు రావాలి
-చట్టబద్దత ఉంటేనే చెల్లుబాటు
– కేటీఆర్ వ్యాఖ్యలు
కులగణన తీర్మానాన్ని తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam prabhakar) సభలో ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కుల గణనపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం అని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ విషయంలో కూడా చర్చను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకులకు అనుమానం ఉన్నా నిర్భయంగా ప్రస్తావించ వచ్చని ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయాలనుకున్నా చేయొచ్చని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని వెల్లడించారు. ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని ఆరోపించారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా తాము కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతిపక్షం ఇచ్చే సహేతుకమైన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇది ఇలా వుంటే తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిలపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. ఆనాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. పదేండ్ల బీసీల లెక్కలు తీసి బీఆర్‌ఎస్ బండారం బయట పెడతామన్నారు. ఈ కుల గణనపై కేటీఆర్ మాట్లాడుతూ…ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు.
కులగణనపై బిల్లులు తీసుకురావాలని కోరారు. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేసీఆర్ అడిగారని చెప్పారు.. తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదని వివరించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందని అన్నారు. బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందన్నారు. అప్పుడే కులగణన సఫలం అవుతుందని…. శాసనసభను మరో 2 రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.