తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మహాలక్ష్మీ పథకం(Mahalaxmi Scheme)లో భాగంగా ఇటీవల మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పురుషులకు సీట్లు దొరక్క ఎంతో దూరం నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు బస్సులో మహిళలకు రిజర్వ్ సీట్లు కేటాయించేవారు. అయితే, పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పురుషులకు రిజర్వ్ చేసిన సీట్లు కేటాయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బస్సుల్లో కనీసం నిలబడేందుకు స్థలం ఉండడం లేదని పురుషులు ఆర్టీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు బస్సుల్లో ఉండే 55సీట్లలో 20సీట్లు రిజర్వ్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నారు.
మరోవైపు పురుషులకు సీట్లు కేటాయిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మహిళల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా? అనే ప్రశ్నలు అధికారులను తడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, మహిళలకు తప్ప పురుషులకు రిజర్వేషన్స్ చేసిన దాఖలాలే లేవు. దీంతో అధికారులు ఈ నిర్ణయంపై తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు, బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.