రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు (Heavy rain)కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే, మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరం మొత్తం ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచే ఎండలు దంచికొట్టడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం మధ్య భాగంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 16, 17వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రుతుపవనాల సమయంలో అల్పపీడం ఏర్పడటం అనేది సాధారణమేనని, దీంతో దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది