నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. గత ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్-1 (Group1) నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించనుంది. గ్రూపు-1 పోస్టులకు ఈ నెల 23 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.
మార్చి 14వ తేదీని దరఖాస్తులకు తుది గడువుగా ప్రకటించింది. ఇక ఇప్పటికే వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు గత ప్రభుత్వ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోట్‌ను విడుదల చేసింది.
గత ప్రభుత్వం ఏప్రిల్ 2022 లో 503 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ సమయంలో ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది వరకు పేపర్ లీకేజీ అయ్యిందని, ప్రమాణాలు సరిగ్గా పాటించలేదని పలుమార్లు గ్రూప్ వన్ రద్దయింది. తాజాగా, తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశారు.
దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీకి చైర్మన్, సభ్యులను నియమించారు. అదే విధంగా గత గ్రూప్-1 నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులు యాడ్ చేశారు. సుప్రీంకోర్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకుంది.