తెలంగాణ(Telangana)లో అత్యంత ఘనంగా జరుపుకొనే పండగ దసరా. ఎవరు ఎక్కడున్నా ఈ పండగకు మాత్రం కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సీజన్ లో బస్సు(Bus)లలో రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) శుభవార్త చెప్పింది. దసరా పండగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే వారికి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి 29 వరకు ఉంటుంది. అక్టోబర్ 30 తేదీ వరకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేవారికి డిస్కౌంట్ ఉంటుంది. రాను పోను ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకుంటే, తిరుగు ప్రయాణ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఆన్ లైన్ బుకింగ్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
ఈ ఆఫర్ ద్వారా అక్టోబర్ 30 తేదీలోగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో టికెట్ డబ్బులు ఆదా కానున్నాయి. ముందుస్తు బుకింగ్ లేదా రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక టికెట్ బుకింగ్ వెబ్ సైట్ https://www.tsrtconline.in/oprs-web/ ను సందర్శించాలని సంస్థ పేర్కొంది. మీకు ఏ తేదీన, ఏ సమయంలో బుకింగ్ కావాలో ఎంపిక చేసుకుని టికెట్లను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కార్డులు లేదా యూపీఐ ద్వారా పేమెంట్లు పూర్తి చేయవచ్చు.
సాధారణంగా పండగ సీజన్ లో ఎక్కువ ఆదాయం పొందేందుకు టికెట్ ధరలను పెంచుతుంది ఆర్టీసీ. మరి ఈసారి కూడా టికెట్ ధరలను పెంచుతుందా, లేదా సాధారణ టికెట్ ధరలపైనే డిస్కౌంట్ ఇస్తుందో చూడాలి.
కాగా బస్సుల్లో నగదు రహిత లావా దేవీలు తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయాణికులు యూపీఐ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సదాపాయం కల్పించనుంది. దీని కోసం ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనుంది. మొదటగా హైదరాబాద్ పరిధిలోని డిపోల్లో క్యాష్ లెస్ చెల్లింపులను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో ఈ యంత్రాలను ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలతో ప్యాసెంజర్లకు టికెట్లు ఇవ్వనుంది.
తెలంగాణ సర్కార్ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగాలుగా మారారు. దీని ద్వారా 40 వేల మందికిపైగా ఆర్టీసీ సిబ్బంది లబ్ధి పొందారు.