జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పిన అద్దె బస్సుల యాజమాన్యంతో తెలంగాణ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు అద్దె బస్సుల ఓనర్లతో ఎండీ సజ్జనార్(MD Sajjanar) భేటీ అయ్యారు.
కాగా, తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశమున్నట్లు అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ సమ్మె సైరన్ మోగించారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ వారితో భేటీ అనంతరం మాట్లాడుతూ.. అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ మేరకు ఒక కమిటీని వేస్తామన్నారు. జనవరి 5 నుంచి యథావిధిగా బస్సులు నడుస్తాయని.. ఎలాంటి సమ్మె ఉండదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా అద్దెబస్సుల యాజమాన్యం ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ… ఐదు సమస్యలను సజ్జనార్‌కు తెలిపినట్లు చెప్పారు. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారని అన్నారు.
జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో ప్రస్తుతం 2,700 అద్దెబస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని చెప్పారు. స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు.