పండుగలు, ప్రత్యేక సందర్భాలకు బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో జనం ఏవిధంగా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వచ్చాయంటే సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం క్యూ కడతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) స్పెషల్ బస్సులను (Special Bus) నడుపుతోంది.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీలో నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కార్గో సర్వీసులను ప్రారంభించడంతో ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతోంది. దసరా, దీపావళి పండుగకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు నిర్ణయించారు. తాజాగా, కార్తీక మాసాన్ని (Karthika Masam) పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతాయని చెప్పారు. మళ్లీ దర్శనం అనంతరం సోమవారం రాత్రికి రాజధానికి చేరుకుంటాయని తెలిపారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలకు బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులు కూడా ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నాయి. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి.